కాళి కాల సంకర్షిణి - goddess kali

                        కాళి  కాల సంకర్షిణి 





శివుణ్ణి నేనైతే - శివానివి నీవు

భవుణ్ణి నేనైతే - భవానివి నీవు

మహాకాలుణ్ణి నేనేతే - మహా కాళికవు నీవు

శర్వుణ్ణి నేనైతే - శర్వాణివి నీవు.




..... కాశ్మీర శైవ సిద్ధాంతం ప్రకారం, కాల సంకర్షిణి - కాళి...ఉన్నతమైన స్వరూపం. ఆమె తన వైశ్విక నాట్యంలో, సృష్టి కాళిగా, రక్త కాళిగా, స్థితి నాశ కాళిగా, యమ కాళిగా, సంహార కాళిగా, మృత్యు కాళిగా, రుద్ర కాళిగా, మార్తాండ కాళిగా, పరమార్క కాళిగా, కాలాగ్ని రుద్ర కాళిగా, మహా కాల కాళిగా, మహా ఘోర భైరవ కాండ కాళిగా పాత్రలను పోషిస్తుంది. ఈ పన్నెండు అభివ్యక్తీకరణల ద్వారా, కాల సంకర్షిణి కాళి...సృష్టి స్థితి లయలను నిర్వర్తిస్తుంది.


...కాల సంకర్షిణి విద్య, 17 శక్తివంతమైన బీజాక్షరాలతో ఉండినట్టిది. ఇది దేవి యామళ తంత్రానికి చెందినట్టిది. ఈ 17 బీజాక్షరాల ఉచ్ఛారణ, ఒక స్థాయి తరువాత సాధకుడిని...ఉన్మని అవస్థకు చేరుస్తుంది.


 సంహార కాళి తత్త్వం...ఈ తత్వంలో సాధకుడు, తాను ఈ విశ్వపు ద్వంద్వత్వానికి అతీతుడనయ్యాను అనే గొప్ప స్థితికి లోనవుతాడు. వీనీలాకాశంలో, మేఘాలు మూర్చ పోయినట్టి స్థితిని అనుభవిస్తాడు. 



మృత్యు కాళి తత్త్వం...సాధకుడు, ఈ మబ్బులన్నీ తొలగి, వైశ్వికంగా, అంతర్లీనంగా ఉన్న ఏకత్వ స్థితిని అనుభవిస్తాడు.

 

రుద్ర కాళి తత్త్వం...ఈ స్థితిలో సాధకుని అన్ని అనుమానాలు, సందేహాలు పటాపంచలయిపోయి, ఈశ్వర చైతన్యంలో లీనమైపోతాడు.



మార్తాండ కాళి తత్త్వం...ఈమె సాధకుని జ్ఞాన శక్తులను సైతం, పూర్తిగా గ్రహిస్తుంది. కాళి యొక్క ఈ నాలుగు స్థితులు, జ్ఞానాత్మక ప్రపంచాన్ని శాసిస్తుంటాయి.




.... కాలాగ్ని రుద్ర కాళి అనే స్థితిలో, కాల రూపమైన కాళి ఇంకా స్థితంగానే ఉంటుంది. అట్టి స్థితిలో ఆమె మహా కాల కాళి స్వరూపంలో ప్రవేశిస్తే, ఒక చిన్న ఆహారపు తునకలా, గుప్పెడుగా ప్రవేశిస్తే, ఆమె కాలాన్ని జీర్ణింపజేసుకుంటుంది. ఈ చరాచర విశ్వంతో సహా, కాలాన్ని ఆమెలో కలిపేసుకుంటుంది. విశ్వమనే స్మశానంలో ఆమె నృత్యం చేస్తుంది. ఆమె యొక్క 12వ స్థితిలో, ఆమె మహా భైరవ ఘోర ఖండ కాళిగా పిలవబడుతుంది. ఇక్కడ, చైతన్యం , తన శక్తిని ఉద్గారిస్తుంది. ఇది జ్ఞాన ప్రపంచంగా, పంచేంద్రియాను భూతమగు భౌతిక ప్రపంచంగా, దానికాధారమైన సూక్ష్మ ప్రపంచంగా సృజన జరుగుతుంది. ఇది మరల ఏకత్వమే. బహుత్వమే, అంతఃసూత్రంగా ఏకత్వం.


"ఏకం సత్ విప్రా బహుధా వదంతి"



... కాశ్మీరీ శైవంలో, కాల సంకర్షిణి కాళిని, "పరా-భైరవి" గా కొలుస్తారు కూడా. ఈమె సర్వోన్నత చైతన్యం యొక్క (Supreme Consciousness), ఒక మహత్తర అంశ. ఈమె చైతన్యం యొక్క , పన్నెండు రకాల జ్ఞాన స్థాయిల ద్వారా ప్రవహిస్తుంది. ఇదంతా మరల భౌతిక సృష్టి యొక్క అభివ్యక్తీకరణకే. 



...కాల సంకర్షిణి కాళి, మహా కాళి రూపంలో, పరమ శివుడి శరీరంపై నృత్యం చేస్తుంది.


... అసలు కాళి శివునిపై ఎందుకు నృత్యం చేస్తుంది? ఈ స్థితిలో శివుణ్ణి "మహా కాలుడు" అంటారు. యావత్ చరాచర సృష్టి యొక్క కాలానికి, సృష్టి యొక్క లయానికి కారకుడీ పరమ శివుడు. ఆమె తన కనుబొమలను ముడుచుకోవడం ద్వారా, యావత్ సృష్టిని, యావత్ స్థల కాలాలను, తన ప్రకృతిని, తానే లయం చేస్తుంది. తానే జీర్ణించుకుంటుంది. భూత-భవిష్యత్-వర్తమానాలు లేవు, చావు పుట్టుకలు లేవు.  "కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ" అని వాడిని స్థుతిస్తాం కదా! అట్టి కాల స్వరూపుడైన, మృత్యువుకు అధిపతి యైన , ఆ శివుడు...ఆ కాళి యొక్క ఆనందకరమైన స్పర్శను అనుభవిస్తాడు. 




Comments