మణి అంటే ప్రకాశించే రత్నం. పురము అంటే నగరము. రత్న ప్రకాశంతో ప్రకాశంతో ప్రకాశించే నగరం అని అర్థం.
ఈ నాడీ కేంద్రం నుండే మానవుడిలో శక్తి ఉద్భవిస్తుంది. సాధకునిలో ఉన్న విశ్వానికి ఈ మణిపూరక చక్రంలో ఉద్భవించే ఉష్ణం ఆధారం అవుతుంది.
ఈ మణి పూరక చక్రాన్ని నాభి చక్రం అని కూడా అంటారు.
నాభికి సమాంతరంగా శరీరం వెనుకవైపు వెన్నెముకను ఆనుకొని ఉన్న ప్రదేశమే మణిపూరక చక్ర స్థానం.
ప్రాణ శక్తిని అన్ని అవయవాలకు సరఫరా చేసే మొదటి శక్తి కేంద్రం మణిపూరకం.
తత్వం : మణిపూరకం అగ్ని తత్వానికి చెందినది. అగ్ని దేవుడు మేషారూఢుడై ఉంటాడు.
చక్ర దళ వివరణ : ఈ చక్ర స్థానంలో 10 దళాలతో ఉన్న చిక్కటి పసుపురంగుతో ఉన్న , ప్రకాశవంతమైన పసుపురంగు పద్మం ఉంటుంది.
ఈ పద్మ దళాలపై డం, ఢం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం...అనే దళ బీజ మంత్రాలు ఉంటాయి.
బీజ మంత్రం : ఈ చక్రం యొక్క మూల బీజ మంత్రం "రం".
ఈ చక్ర జ్ఞానేంద్రియాలు - తన్మాత్రలు - కర్మేంద్రియాలు :
ఈ చక్రం జ్ఞానేంద్రియమైన కంటితోనూ, తన్మాత్ర అయిన కంటి చూపుతోనూ సంబంధం కలిగి ఉంటుంది. దీని యొక్క కర్మేంద్రియాలు పిరుదులు.
తల్లీ బిడ్డల ప్రేగు బంధం (అంబిలికల్ కార్డ్)...ఈ మణిపురం లోనే ఉంటుంది.
ఈ చక్రం పది దళములు గలిగి పసుపు వర్ణము గల అగ్ని తత్వ కమలము.
మణిపూరక చక్రం - లలితా సహస్ర నామావళి :
ఈ మణి పూరక చక్రం...లలితా సహస్రంలో...లాకిని శక్తిగా అభివర్ణించబడింది.
ఈ చక్రంలో రుద్రుడు, రుద్రుని శక్తి లాకిని ఉంటారు.
బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది.
ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరానికి అందిస్తుంది.
మణి పూరకం - పంచ కోశ సంబంధం :
ఈ చక్రానికి... పంచ కోశాలలో ప్రాణామయ కోశంతో సంబంధం ఉంటుంది.
మణి పూరకం - శరీర వ్యవస్థ :
ఈ చక్రానికి శారీరక వ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం ఉంటుంది.
తత్వం :
పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతిక సృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే :
అవయవముల యందు నీరు చేరుట, నోటికి సంబందించిన వ్యాధులకు కారణమౌతుంది.
నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు, మధుమేహము కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.
ఈ చక్ర మానసిక స్వభావం :
కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభత్వం, స్వార్ధపరత్వం.
తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కృంగిపోవడం.
మూసుకుపోయిన ఈ చక్రం తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తనను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు...లాంటి లక్షణాలు వస్తాయి.
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.
ఈ మణిపూరక చక్రం లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి.
ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.
ఈ మణి పూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనుస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంబైన ముల్లోకములను చల్లపరుచును.
ఈ చక్రం లోని అసమానతలు ఎలా శుద్ధి చేయాలి?...
ఈ చక్రమునకు "లాకిని" దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే...
అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ...) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి.
ఈ చక్ర ఉద్దీపనకు... దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా ఉండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేక ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.
మణిపూరక చక్ర సాధన :
ఈ మణి పూరక చక్ర సాధనలో ... ఎవరి ఆరాధన బట్టి తత్సంబంధ దైవీక వస్తువులు రావచ్చును.
ఒక సాధకుడి సాధన...నిరాకార సాధన అయితే ఆ సాధకునకు ఆ చక్రానుభవాలు, అనుభూతులే వస్తాయి. సాకార సాధకుడైతే, చక్రానుభవాలతో పాటు చక్ర దైవీక వస్తువులు లభ్యం కావచ్చును. లేదా ఆయా దైవీక వస్తువులున్న క్షేత్ర దర్శనాలయినా కలుగవచ్చును. ఈ విషయంలో " పిండే పిండే మతిర్భిన్నః "
షట్చక్ర సాధనలో ...చక్ర జాగృతి, చక్ర శుద్ధి, చక్ర ఆధీనము, చక్ర విభేదనము ఉంటాయని గ్రహించవలెను.
ఈ మణి పూరక చక్ర సాధనలో ...సాధకుని ఇష్ట దైవము సజీవ మూర్తిగా కూడా దర్శనము ఇవ్వవచ్చును.
మణి పూరక చక్ర సాధనలో ఈ చక్రం లోపలికి వెళ్ళాలంటే... స్వాధిష్ఠాన చక్రము పై ఉన్న బ్రహ్మ గ్రంథిలోకి ప్రవేశించి...ఈ గ్రంథిని జాగృతం చేసుకుని...తరువాతనే మణి పూరక చక్ర సాధన చెయ్యాలని సిద్ధులైన కొంత మంది యోగుల అవగాహన.
Comments
Post a Comment