అనాహత చక్ర సంపూర్ణ వివరణ - Anahata Chakra is a complete explanation- vishwagurunidhi


 

"అనాహత చక్రం" మన శరీరంలో గుండె వెనుక భాగమందు  వెన్నెముకలోని హృదయ నాడీ మండలం వద్ద ఉన్నది.

ఇది 600 నాడులు కలిగి, ఒక సారి ఊపిరి పీల్చి వదలేసరికి 600 సార్లు స్పందిస్తుంది. ఇది ప్రాణవాయువు సంచలనాలను నియంత్రిస్తుంది.

ఈ అనాహత కమలం 12 దళాలు కలది. దీని తత్త్వం వాయుతత్త్వం.


లలితా సహస్రంలో ఈ చక్రంలో గల రాకిణి శక్తిని ఇలా నిర్వచించారు :

శ్లో|| అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదన ద్వయా

దంష్ట్రోజ్వలా ఽ క్షమలాది ధరా రుధిర సంస్థితా ||

శ్లో|| కాళ రాత్ర్యాది శక్తౌ ఘవృతా స్నిగ్దౌదన ప్రియా

మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ ||

ఈ అనాహత చక్రం థైమస్ గ్రంథిని ( endocrine gland ), వ్యాది నిరోధక శక్తిని...నియంత్రిస్తుంది. ఇది హృదయ స్థానమందుండి, ప్రాణ శక్తి స్పందనను, శ్వాస క్రియను నియంత్రించే వాయు తత్వంతో ఉంటుంది.

ఈ చక్రాధిష్ఠాన దేవత "వామ దేవి " రెండు ముఖములతో, శ్యామల వర్ణంతో " రాకిణి శక్తి " గా సప్త ధాతువులలోని " రక్త ధాతువుకు " అధి దేవతగా ఉంటుంది.

ఈమె కం,  ఖం, గం, ఘం, ఙం, చం, ఛం, జం, ఝం, ఞం, టం, ఠం  అను యోగినులచే సేవించబడుచున్నది.

లలితా సహస్రమందు ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలదిగా వర్ణించ బడియున్నది. లలితా సహస్ర నామావళి యందు అమ్మవారు "రాకిణి గా" విలసిల్లియున్నది.

ఈ అనాహత చక్రము " శర్వుడు " అను నామము గల శివునికి స్థానము.

ఈ అనాహత చక్ర కర్మేంద్రియం : లింగము

తన్మాత్ర : స్పర్శ తన్మాత్ర

హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది.

అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం.

ఆగని "శబ్దబ్రహ్మం" ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం.
అనాహత నాదం.  ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది.

ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు.

దిగువనున్న మూలాధారాది మూడు చక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణతను కల్గించడానికి సూత్రధారిలా దోహదం చేస్తుంది.

అనాహత చక్ర వర్ణన :

అనాహత చక్రమందలి వాయు మండలమందు కర్మేంద్రియమైన లింగము మరియూ స్పర్శ తన్మాత్ర కలవు. ఈ చక్రమందు సౌర మండలమున్నది. అందు కోటి సూర్య ప్రభా సమానమైన ఒక త్రికోణము కలదు. దీనిలో వాయు బీజమైన " యం " అంకుశాన్ని ధరించి జింక వాహనారూఢుడై ఉన్నాడు. ఈ వాయు బీజమందు ఈశ్వరుడు బాణలింగ రూపంలో ఆశీనుడై వరదాభయ ముద్రలతో ఆశీనుడై ఉన్నాడు. ఆయన క్రింద హంసాకారంలో జీవాత్మ, నిశ్చల జ్యోతి రూపంలో  ప్రకాశిస్తున్నాడు.

ఈ చక్రానికి పంచ కోశాలలో మనోమయ కోశంతో సంబంధం ఉంటుంది.

శారీరక వ్యవస్థలోని శ్వాసకోశ వ్యవస్థతో ఈ చక్రం సంబంధం కలిగియుంటుంది. ఈ చక్ర నిర్వహణ మందగిస్తే/ ఈ చక్రం పనిచేయకపోతే హృదయ సంబంధ వ్యాదులు, శ్వాస కోశ వ్యాదులు వస్తాయి.

జ్ఞానేంద్రియం : చర్మం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే :

చర్మవ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాదులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండె జబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.

ఈ చక్ర మానసిక స్వభావం :

ఈ చక్రం మూసుకు పోవడం వలన ప్రేమ రాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు వస్తాయి.

ఈ చక్రం తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియ విజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత అలవడతాయి. 

మనోమయ కోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందు ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి ( Will Power ) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.

అనాహతము అంటే చేయబడని నాదం. వెన్నెముకను ఆనుకుని ఛాతికి వెనుక ఉన్న భాగమే అనాహత చక్ర స్థానం. దీని క్షేత్రం హృదయ స్థానం. ఈ స్థానంలో విష్ణు గ్రంథి ఉన్నది.

మన ప్రమేయం లేకుండా, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రతిరోజూ 21, 600 సార్లు అనాహతనాదం జరుగుతూనే ఉంటుంది. అదే "హంస" జపం. అదే అజపా జపం. అదే అజప గాయత్రి.

ఈ దళాలకు బీజ మంత్రాలు కం, ఖం, గం, ఘం, ఙం,చం,  ఛం,జం,ఝం,ఞం,టం,ఠం...ఈ పన్నెండు దళాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీకలు.

ఈ సంవత్సర కాలాన్ని 6 నెలలు ఉత్తరాయణం గానూ, 6 నెలలు దక్షిణాయణం గానూ విభాగించారు.

ఈ చక్రం " థైమస్ గ్రంథి " స్రావాలను నియంత్రిస్తుంది.

గాయత్రీ మంత్రం లోని సప్త వ్యాహృతులలో ఈ చక్రం యొక్క వ్యాహృతి "ఓం మహః". 

"మహా నిర్వాణ తంత్రం"లో యోగసాధకుడు, మానసిక ఉపాసన చేయుటకు సరియైన స్థానంగా ఇది చెప్పబడినది. శబ్ద బ్రహ్మముగా చెప్పబడే నాదం ఈ అనాహత చక్రమందు వినిపిస్తుంది.

ఈ చక్ర ధ్యానం వల్ల మనిషి మంచి మేధస్సు, వాక్కులు కలిగి, మంచి పనులను చేస్తూ, విశ్వ ప్రేమాది కారుణ్య భావం కలిగి పూజ్యుడౌతాడు.

ఈ అనాహత చక్రం ఉత్తేజ పరుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక చీకటి గుహలో"బంగారు వర్ణపు దీప కళిక"కనిపించిన అనుభూతి కలుగుతుంది. 

ఈ అనాహత చక్రం జాగృతమైనప్పుడు ఇతరుల గురించి తెలుసుకొనే లక్షణం పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి ఇంద్రియాలపై ఆధిపత్యం వస్తుంది. ప్రేమ తత్వం అలవడుతుంది.

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం?...


శాస్త్రప్రకారం పరిశీలిస్తే ...
ఈ చక్రానికి రాకిణి అధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషధములను వినియోగిస్తూ, ఈ చక్ర మధ్యమందు గల బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు.

 కుండలినీ శక్తి మేల్కొని అనాహత చక్రాన్ని తాకిన తరువాత ఆ చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. 

క్రమేణా " దీర్ఘ ఘంటానాదం " అనుభూతం అవుతుంది. నిరంతరం ఓంకార నాదం అనుభూతికి వస్తుంది.

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే :


ఇతరులకు హాని చేయకుండా ఉండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. అది శాస్త్రీయ సంగీతం మాత్రమే. 

 సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి. 
ఇక  ఈ చక్రానికి అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలను, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాభ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ చక్రం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది.

ఈ అనాహత చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదనము...సమయాలలో వివిధ అనుభవాలు, అనుభూతులు వస్తాయి.

మణిపూరక చక్ర సిద్ధిలో Clairvoyance వస్తే, ఈ అనాహత చక్ర జాగృతిలో ఈ సిద్ధిలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఈ అనాహత చక్ర సిద్ధిలో...ఇంకా అనేక సిద్ధులు వస్తాయి.

ఈ చక్ర సిద్ధి సమయంలో కొంత మంది ఉత్తమ సాధకులకు మహా కాలుడు, మనో భూమికలలో అసంకల్పితంగా దర్శనమిస్తున్నాడు.

కొంత మంది గొప్ప సాధకులకు...ఈ చక్ర జాగృతి, సిద్ధి సమయాలలో మరణ భయం కలిగింది. అయితే భయపడకుండా సాధన ఆపకుండా ఉంటేనే కుండలినీ శక్తి పై చక్రాలకు ఉద్యమిస్తుంది. భయపడితే అధోగమిత్వం చెందుతుంది.

ఈ చక్రం జయింపబడకుండా ఉండడానికి...అనేక మాయలు అడ్డు తగులుతాయి.

ఈ చక్రము బల పడుటకు వేయవలసిన ముద్రలు :

వాయు ముద్ర, అపాన ముద్ర

ఈ చక్ర సాధనానుభూతులు :

 తీవ్ర సాధనలో ద్వాదశ కమలాలు గల " యం " బీజాక్షర యుక్తమైన ఆకుపచ్చని కమలం కనిపిస్తుంది.


 కొన్ని సార్లు...ఈ చక్ర సిద్ధి సమయంలో హృదయం మధ్యలో కల్పవృక్షం దర్శనం అవుతుంది. అనేక సిద్ధులు అనుభవం అవుతాయి.

ఈ చక్రమందు గల రాకిణి శక్తి : 

లలితా సహస్ర నామావళిలో...ఈ చక్ర దేవతా మూర్తి " రాకిణి " గా వర్ణించబడింది.

రాకిణి శక్తి వర్ణన :

 రాకిణి శక్తి నలుపురంగులో ఉంటుంది. ఈమెకు రెండు వదనములు ఉన్నాయి. ఈమె ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది.

 ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది.

 నాలుగు చేతులలో అక్షమాల, శూలము, కపాలము, డమరుకము, దరించునది.

 అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఈమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది.

రాకిణి శక్తికి సంబంధించిన బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.ఈ అనాహత చక్ర మూల బీజాక్షరం " రం ".

Comments