భేతాళుడు - భేతాళ సాధన - Vishwagurunidhi

భేతాళుడు - భేతాళ సాధన - Vishwagurunidhi

భేతాళుడు - భేతాళ సాధన

     భేతాళుడు....అన్న పదం "వైతాళ్‌"(vaital)...అనే పదం నుండి వచ్చింది. "వైతాళ్" ...అనగా, అసాధారణ కృత్యాలు చేసేవాడని అర్థం. ఆ కృత్యాలు, మానవ మాతృలకు సాధ్యం కాదు. ఆహత, అనాహత శబ్దాలు కలిస్తే, "వై" (vai) అనే శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తరంగాలు, కొన్ని సార్లు అసాధారణ తత్వాలను , సరిచేస్తాయి. ఈ భేతాళునికి ఆగియా భేతాళ్, జ్వాలా భేతాళ్, ప్రళయ వేతాళ్ అన్న పేర్లు కూడా కలవు.


భేతాళ సాధన చాలా కష్టంతో కూడుకున్నది. ప్రాణ ప్రమాదం కూడా. కేవలం అకాడమిక్ ఆసక్తితోనే ఇది వ్రాస్తోన్నది. సాధకుడు, చంచల మనస్కుడైతే, స్థిర చిత్తుడు కాకపోతే....వాడిపై భేతాళుడు అధిరోహిస్తాడు. అంటే భేతాళ సాధన జాగ్రత్తగా చేయకపోతే, కలగబోయే సిద్ధి విలోమం జరుగగలదు.

తంత్రంలో భేతాళ సాధన ముఖ్యమైనది.భేతాళుడు అనగా అర్థంలో "నిశా సంచారి". భేతాళురు, పరమశివుడి, రుద్ర గణాలలో  ఒక కీలకమైనవారు. రుద్రగణాలలో దేవీ-దేవతలు 18 సమూహాలుగా ఉంటారు. గరుడులు, నాగులు, గంధర్వులు....వీరందరూ రుద్ర గణాలే. భేతాళురు కూడా....రుద్ర గణాలలో ఒక శాఖ. దేవతలు ఈ భేతాళ గణాలను, ఇతర నకారాత్మక శక్తులతో (negative forces) పోరాటానికి పంపిస్తూ ఉంటారు. భేతాళ గణాలలో , కేవలం పురుష గణాలే ఉంటాయి. స్త్రీ గణాలు ఉండవు. ఈ 18 రకాల రుద్ర గణాలలో, కేవలం భేతాళుడికి మాత్రమే, ఆలయాలు ఉన్నాయి. ఈ భేతాళ గణాలు, దేవతల సేవకులు. వీరు పిశాచ శాఖకు చెందినప్పటికీ, వీరు దేవతలతో సమానంగా పూజలందుకుంటారు. దేవీ దేవతలకు, భేతాళుడు ప్రీతి పాతృడు. వారు భేతాళుని, తమ సోదరునిగా భావిస్తారు. పోతురాజు లేదా కరుప్పు స్వామి అనే పేరుతో భేతాళ ఆరాధన ఉంది. గ్రామాలలో, 7 రకాల గ్రామదేవతలతో పాటుగా ఈ భేతాళుని కొలుస్తారు. ఈ భేతాళుడు, స్మశాన కాళి యొక్క సేనాధిపతి కూడా. భేతాళుడు, ద్రిష్ఠి/దిష్టి దేవతగా పరిగణించబడుతున్నాడు. అందుకనే ఇళ్ళముందు మనం పెట్టుకొనే రాక్షసుడి బొమ్మ " భేతాళుడే". మన పరిసరాలలోనూ, మనకు గాని ఉండే నకారాత్మక శక్తిని (negative energy) తొలగించేది, భేతాళుడే. సామాన్యంగా భేతాళుడు, తన చేతులలో కొరడాను, (కొన్ని సార్లు అగ్నిని),కత్తిని కలిగియుంటాడు.

ప్రాచీన శాస్త్రాలలో భేతాళుని గూర్చి చెప్పబడినా, అతని మూలాలు , పుట్టుక ...పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు.  కేవలం రుద్రగణాలలో అతని పాత్ర , అతను చేసే పనులను గూర్చిచెప్పబడ్డాడు. (శివ గణాలలో కాల భైరవుడు, వీర భద్రుడి జననాల గూర్చి చెప్పబడి యున్నది). అయితే భేతాళుడి పుట్టుక  పరిశోధనార్హం(ఔత్సాహికులకే)...అయితే ఈ భేతాళుని గూర్చి మనం, విక్రమార్కుడి/విక్రమాదిత్యుని కథలలో చదువుతాం. వింటాం.


    టిబెట్టు తంత్రంలో.....ఈ భేతాళుడు , స్మశానాలలో తిరిగే వాడిగాను, శవాన్ని కలిగి యుండేవాడిగానూ అభివర్ణించబడ్డాడు. సిద్ధి చేయబడిన భేతాళ యంత్రము, నరదిష్ఠి నివారణకు ఉపయోగిస్తారు. వారణాశి లాంటి కొన్ని ప్రదేశాలలో, తాంత్రికులు భూత, భవిష్యత్తులను తెలుసుకొనుటకు....శవ సాధన చేస్తారు. వారు ఒక శవం క్రింద , ప్రాణ ప్రతిష్ఠ చేసిన భేతాళ యంత్రాన్ని ఉంచి, ఆ శవంపై కూర్చొని, సాధన చేయడం ద్వారా ...భూత, భవిష్యత్తులను తెలుసుకుంటారు. ఖండ యోగ సాధనలో పరిణతి పొందాలంటే, ఈ భేతాళ సాధన కూడా చేయాల్సిందే. అలాగే, పరకాయ ప్రవేశ విద్యలో సిద్ధి పొందడానికి కూడా ఈ భేతాళ సాధన సహాయ కారి. గుప్త నిధులను, భేతాళుడు కాపలా కాస్తాడు.

భేతాళుని, దక్షిణ-వామ-కాపాలిక-అఘోర...ఆచారాలలో కూడా ఉపాసన చేస్తారు. అయితే ఈ భేతాళురలోనూ 32 రకాల భేతాళురు ఉన్నారని, తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. భారత దేశానికి గల కొంకణ తీర ప్రాంతాలలో చాలా చోట్ల భేతాళుని  దేవాలయాలున్నాయి.
   

   అతీంద్రియ శక్తులు పొందడానికి , విక్రమాదిత్యుడు లేదా విక్రమార్కుడు , ఉజ్జయిని దగ్గర గల సిద్ధ వటం (క్షిప్రా నది ఒడ్డున గల మర్రి చెట్టు)లో భేతాళ సాధన చేసి, ఆయా శక్తులు పొందుతాడు.


    శివుడు, ఈ భేతాళుడిని " భూతాల" నాయకుణ్ణి చేస్తాడు.


    తాంత్రికులు ఈ భేతాళుణ్ణి, అత్యంత ధైర్య శాలిగా వర్ణిస్తారు. భేతాళుడి విగ్రహాలు కర్ర లేదా రాతితో తయారు చేస్తారు. గ్రామాలలో  ఒక గుండ్రని రాయిని, ఈ భేతాళునిగా భావించి ఆరాధిస్తారు కూడా.

Vishwagurunidhi

Comments