మహాశక్తి వృద్దకాళియే ధూమావతి శక్తి గా మారిన అమ్మవారి కోసం - Vishwagurunidhi

దశ మహావిద్యల లో - ధూమావతి దేవి కోసం : Vishwagurunidhi
ధూమం అంటే పొగ. పొగతో నిండినది కావున,  ధూమావతి. ప్రకాశం కాదు. శక్తి యొక్క కార్య కలాపాలను అతి సుందరంగా దశమహావిద్యల ప్రభావాలుగా వర్ణించారు. అందులో వికృతిగా చెప్పబడినది ధూమావతి. ఈమె ముసలమ్మ. ఈవిడ స్వభావం అంతర్ధానం. తెలివిని అంతర్ధానం చేసి దాని మరుగున ఉన్న నిజాన్ని లాగి చూపడం ధూమావతి లక్షణం. సంసారంలో చిక్కుకుని ఉన్న వాళ్ళను నిద్ర, మూర్ఛ, మరపు లాంటి ఏ అజ్ఞానం అయినా కప్పి ఉండడం వల్ల సంసారులు, ఆత్మను తెలుసుకోలేకపోతున్నారో అది కూడా ధూమావతియే. ఆమెది అభావ ప్రపంచం.

       అవిద్య కప్పుకుని ఉండటం వల్ల మనం జ్ఞానజ్యోతిని చూడలేకపోతున్నాం.మాయకు అవిద్యకు భేదం ఉంది. ఏకంగా ఉన్న ఆత్మను బహువిధాలుగా చూపేది మాయ. ఎల్లప్పుడూ ఆత్మస్థితిని వెనక్కు నెట్టి మరుగుపరచి భ్రాంతిని కలిగించేది అవిద్య. ధూమావతికి అజ్ఞానం,నిద్ర రెండిటినీ కల్పించే శక్తి ఉన్న దేవతగా వర్ణన ఉంది. వేదం ఈ దేవతను రాత్రి అంటుంది.

      ప్రకృతిలోని అభావం కూడా ధూమావతియే. అభావమంటే దారిద్ర్యం,లేకపోవడంఇత్యాదులు. ధూమావతి అంటే అంతరాయం. అంతరాయం భయాన్ని తెచ్చిపెడుతుంది. మహా శక్తి ధూమావతి ఏకాకి. స్వయం నియంత్రిత. ఆమెకు భర్త ఎవరూ లేరు. అందుకని ఆమెని విధవరాలు అన్నారు.ఆమె భవరూపి, పతి రహిత, భగవతి. మహాదేవుణ్ణి మింగేసినది కనుక శివసంపర్కంలేని నిఖార్సైన స్త్రీ శక్తిగా వర్ణిస్తారు.

       He ని మింగిన she ఆమె.దీనికి ఒక కథ ఉంది.

   ఒకసారి శివపార్వతులు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు.శివునితో ఆమె అన్నదట.... "చాలా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా కావాలి." శివుడు జాప్యం చేసాడు. మళ్లీ మూడు నాలుగు సార్లు అడిగిందామె. కాని ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఆమెకి ఆకలి భరించలేనంతగా పెరిగిపోయింది. అమాంతంగా మహాదేవుడినే ఎత్తి పట్టుకుని మింగేసింది. ఆమె శరీరం నుండి ధూమరాశి చిమ్ముకుని బయటకి వచ్చింది.లోపల నుండి శివుడు ఇలా అన్నాడు. పార్వతీ! సుందరమైన నీ తెల్లని దేహాన్ని నన్ను మింగి నల్లని పొగలతో కప్పేసుకున్నావు ఇప్పటినుండి ఈ నీ అవతారం ధూమ్ర లేక ధూమావతి అని ప్రసిద్ది కెక్కుతుంది అని చెప్తాడు శంకరుడు.

        వందలకొలది నక్కలు అరిచినట్లుగా అరిచే ఉగ్రచండికను తన దేహం నుండి పార్వతి ఉత్పత్తి చేసింది.ఆమెను శివదూతగా ఉపయోగించింది. ఈమెకి ఎవరూ పురుషుని స్వామ్యత్వం లేదని చెప్పడానికే శివుణ్ణి ఆమె మింగేసిన్దని ఉగ్గడించడంలోని భావం. ఆమె అంగ భూతాలైన నక్కలు,అసురుల పచ్చిమాంసంతో తృప్తి చెందాయి.ఇదే దేవికి ఆకలి వేసినది అనడంలోని రహస్యం. సప్తసతిలోని ఎనిమిదవ అధ్యాయంలో  ఈ వ్యాఖ్యానం దొరుకుతుంది.

        ధూమావతి, బగళా, తారా, కాళీ దేవతలు ఘొర కర్మలకై ఉపయుక్తులౌతారని చెప్తారు. ఈమె ధ్యానమూర్తి. వివర్ణ, చంచలా, నల్లని దేహం కలిగి మురికి గుడ్డలు చుట్టుకుని ఉంటుంది. విరబోసుకున్న జుట్టు, కోపిష్టి, విధవ కాకధ్వజం కల రధంమీద కూర్చోడం, చేతిలో చేట, ఆకలిదప్పులతో వ్యాకుల పడుతూ ఉండటం ఇవి ఈమె లక్షణాలు.

     నిర్మలమైన కళ్లు కలిగిన దేవిగా పిప్పలాద మహర్షి ఈమెని దర్శించిన ఉపాసకుడు. విపత్తి నాశనం,రోగనాశనం కలగడానికి,యుద్దంలో విజయం పొందడానికి, ఉచ్చాటన, మారణ క్రియలకూ,భూత ప్రేత ప్రయోగాలకు ఉపయోగించే దేవత. "మహాపది,మహాఘోరే, మహారోగే, మహారణే, శత్రూచ్ఛాటనే, మారాణాదౌ జాంతూనామ్మోహనే తధా".

   ఈమె ఉపాసకుల మీద దుష్టాభిచార ప్రభావాలు ఉండవు.

        ధూమావతి పేలకుండా ఉన్న చీకటి పేలిన తరువాత సూర్యబింబం. సుఖంలోని మాధుర్యంవైపు మన మనస్సులను ఈడ్చుకొనిపొయే విరూప మోహిని ధూమావతి.ఈమె నిత్యానంద ప్రదాయిని. సంసార జంబాలంలో చిక్కుకున్న వాళ్ళ పాలిట ధూమావతి అవిద్యయే కాదు, దుఖదాయిని కూడా. లలితా సహస్రనామాలలో విద్యాయై నమః ప్రక్కనే అవిద్యాయై నమః అని కూడా ఉంది.
        
         ఆవరణ శక్తి,విక్షేప శక్తి అని మాయలో రెండు భేదాలు ఉన్నాయి. ఉన్నదాన్ని ఆవరించుకొని లేనట్లుగా చూపేది ఆవరణ శక్తి. లేనిదాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించి భ్రమింపచేసేది విక్షేప శక్తి. ధూమావతి ఈ రెండు పనులనూ చేస్తుంది. మనజీవితాలలో కాంతిమయమైనది మధ్యదశ ఒక్కటే. పుట్టుకకు ముందు చావుకు పిదప అంతా అవ్యక్తమే. ఈ అవ్యక్త దశే ధూమావతి. దైహిక వ్యాపారాలలోని సౌఖ్యాన్ని మోహాన్ని ఆనందాన్ని అసత్యమనుకున్న మరుక్షణమే దేహాతీత భావాతీత శూన్యత్వం మనముందు ధూమావతిగా ప్రత్యక్షం అవుతుంది.

        వృద్దకాళియే ధూమావతి, కాలానికి కాలాతీత తత్వానికి, ప్రాణానికి ప్రాణాతీత అనుభవానికి, వ్యక్తానికి ప్రతిబింబమైన అవ్యక్తానికి అగ్నిలక్షణ దౌహృదమైన ధూమావతి ప్రతీక. హృదయంలోని దహరాకాశం ధూమావతికి నివాస స్థానం. కాని ఎక్కడా స్థిరపడి ఉండకుండా అంతటా వ్యాపించి తిరగటమే ఆమె స్వభావం.

        చేట, తట్ట  మనం సుఖాలనుకునే భావాలను చెరిగి జల్లించి యధార్ధాన్ని నిరూపించే ప్రయత్నానికి ప్రతీకలు. వికార రూపానికి ఒక సుందర రూపం దాగి ఉన్నదని చేసే బోధ మాంత్రికురాలి ఆకారం కల ధూమావతి మంత్రోద్దిష్ట నిరూపణం. ఈమె శివుడు లేని నిఖార్సైన శక్తితత్వం. పిప్పలాదుడు అధర్వవేదాన్ని ప్రశ్నోపనిషత్తును దర్శించి సృష్టించిన మహర్షి.ఆయన ఈ మహావిద్యకు ద్రష్ట. ఈ వ్యాసం అకాడమిక్ ఆసక్తితో మాత్రమే ప్రచురించడమైనది.

హెచ్చరిక:

ఏ మహావిద్య అయిన సరే గురు ఉపదేశం లేకుండా సాధన చేయరాదు. గురువు అధ్వర్యంలోనే సాధన చేయాలి. తెలిసీ తెలియక గుడ్డిగా చేసే ప్రయత్నాల వల్ల ప్రమాదాలకి దారితీస్తుంది. జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఎందుకంటే అది శక్తి, మనం వ్యక్తులం. తెలిసి చేసినా, తెలియక చేసినా ఎదురయ్యే పరిణామం మంచి అయినా చెడు అయినా స్వీకరించాల్సిందే. కాబట్టి ఏ మహావిద్యనైనా ఉపాసించ దలచినవారు గురుముఖంగా స్వీకరించమని నా మనవి.

Comments