బాల కాళి - మంగళా కాళి
కాళీ దేవి అనంత రూపాలలో ‘బాల కాళి’ రూపం ప్రసిద్ధమైనంది. బాలకృష్ణుని, బాల గణపతిని, బాలాదేవిని చిన్నపిల్లలుగా ఎలా ఉపాసిస్తామో, అలాగే కాళీదేవిని చిన్నారి కాళిగా పూజిస్తారు. తెలుగు యోగి, కాళీ మంత్ర సిద్ధుడు త్రైలింగ స్వామి అమ్మవారిని 12 సంవత్సరాల చిన్నారి బాలికగా ‘మంగళ కాళి’గా అర్చించారు. ఆయన దీర్ఘకాలం తపస్సుకు మెచ్చిన అమ్మవారు బాలకాళిగా (మంగళా కాళి)గా పట్టుపరికిణీ ధరించి సుకుమారంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ త్రైలింగ స్వామి కన్నుల ముందు నిలిచింది. త్రైలింగ స్వామికి ఎన్నో సిద్ధశక్తులను ప్రసాదించింది.
దీర్ఘాయువును అనుగ్రహించింది. కాశీలో త్రైలింగ స్వామి ఆశ్రమం ఉన్నది. అక్కడ అమ్మవారు ‘మంగళా కాళి’గా, 12 సంవత్సరాల బాల స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఉమాచరణ్ అనే భక్తుడు త్రైలింగ స్వామి దగ్గర కాళీ మంత్ర ఉపదేశం పొంది, తీవ్ర సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. కానీ, ఆయనకు ఆ తల్లి సాక్షాత్కారం మాత్రం కలుగలేదు. దీంతో ఆయన త్రైలింగ స్వామి దగ్గరకు వెళ్లి.. ‘అమ్మవారి కృప నాకు తెలుస్తోందిగానీ, సాక్షాత్కారం మాత్రం కలగట్లేదు’ తన ఆవేదనను వివరించగా.. త్రైలింగ స్వామి ఆ రోజు చీకటి పడి తరువాత అతడిని తన కాళీ
మందిరంలోకి తీసుకువెళ్లారు. అందమైన మంగళా కాళిగా ప్రకాశిస్తున్న అమ్మ విగ్రహాన్ని ఉద్దేశించి ‘మంగళా’ అంటూ ఆహ్వానించారు. అప్పుడా విగ్రహం ఒక సుందరమైన బాలికగా మారి నడిచి వచ్చింది.
ఆనంద ఆశ్చర్యాలతో పరవశించిన ఉమాచరణ్ స్వామి అనుమతితో ఆమె పాదాలను తాకి నమస్కరించాడు. ఆ తరువాత ఆ సుందర బాలిక నెమ్మదిగా నడిచి వెళ్లి మళ్లీ మంగళా కాళిగా శిలాకృతిని ధరించింది. బెంగాల్‌కు చెందిన కాళీ మంత్ర సిద్ధుడైన రామప్రసాద్ జీవితంలో కూడా బాల కాళిగా అమ్మవారు దర్శనం ఇచ్చి, ఆయన ఇంట చిన్నపిల్లగా నడయాడేది. బాల కాళిగా అమ్మవారిని పూజిస్తే చిన్న పిల్లలలో ఉండే బాలారిష్టాలను, అనారోగ్యాలను తొలగిస్తుంది. విశేషించి మంగళా కాళిగా కొలిస్తే మంగళ స్వరూపిణి అయి సకల శుభాలను కలిగేటట్లు అమ్మ అనుగ్రహిస్తుంది.
Comments
Post a Comment