గ్రంథములలో భగవద్గీత - పండుగలలో దీపావళి - Vishwagurunidhi
గ్రంథములలో భగవద్గీత - పండుగలలో దీపావళి
ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు కొల్లలు కొల్లలుగా ఉన్నవి. ఇవన్నీ ఒక ఎత్తు. భగవద్గీత ఒక ఎత్తు. దాని గొప్పతనం మరి దేనికీ లేదు. జ్ఞానోపదేశం చేసేపుస్తకాలు ఎన్నో ఉన్నాయ్. భారతంలో ఎన్నో ఘట్టాలలో జ్ఞానోపదేశం చేయబడివుంది. ఇంతేకాక శివపురాణం, విష్ణుపురాణం, స్కాంద మొదలైన పురాణాలలోకూడా ఉపదేశాలు విస్తారంగా కనిపిస్తున్నవి. వీనితోపాటు ఆగమాలున్నవి. ఉపనిషత్తులున్నవి. అయినప్పటికీ ఇతిహాసంలో ఒకభాగమైన భగవద్గీతకు మాత్రం అసామాన్య గౌరవం చిరస్థాయిగా వుంది. దీనికి కారణం మేమిటి? ఇతిహాస పురాణాలకంటే స్మృతులకు అధికప్రాధాన్యం ఉంటుంది. స్మృతులకు కంటే శ్రుతులకు మరింత ప్రాధాన్యం. వీనినన్నిటినీ ఒక వంకకునెట్టి భగవద్గీత ఒక మహోన్నతస్థానాన్ని ఆక్రమించింది. దీనికి కారణమేమిటి?
తక్కినవానికంటే భగవద్గీతకు ఎక్కువ ప్రామాణ్యం ఉన్నదా? అని ప్రశ్నిస్తే. ఇతిహాసపురాణాలకు ఎంత ప్రామాణ్యమున్నదో అంత ప్రామాణ్యమే భగవద్గీతకున్నూ ఉన్నది, 'లేదు; భగవద్గీత ఒక విశిష్టమైన ఉపదేశగ్రంథం. అందులో జ్ఞానోపదేశం విస్తారంగా చేయబడి ఉంది.' అని ఎవరయినా అంటే, భగవద్గీతకు సమానంగానే ఇతర గ్రంథాలు శివపురాణం, విష్ణుపురాణం భారతంలోనేఇతరఘట్టాలు ఎన్నోఉన్నాయి. వానిలోనిఉపదేశాలుకూడా త్రోసివేయదగినవికావు. ఇదంతా నిజమే అయనప్పటికీ భగవద్గీత భగవద్గీతే. దీని ఖ్యాతి ఉపనిషత్తులకుకూడా లేదు. ఎందుచేత?
ఈకాలంలో దేనికైనాసరే ప్రచారం జాస్తీగాకావాలి. ప్రచారంకోసం కొన్నివారాలే ఏర్పాటవుతున్నాయి. పోనీ భగవద్గీత ప్రఖ్యాతికోసం మనం ఏమన్నా 'భగవద్గీతావారం' అని ప్రచారం చేసుకొన్నామా అంటే అదీలేదు. పైగా దీని ప్రఖ్యాతి నేటిదిగాదు. ఆదిశంకరులవారికి పూర్వమే భగవద్గీతకు ఎన్నో వ్యాఖ్యానాలున్నవి. మనదేశమే కాదు. భగవద్గీతా ఖ్యాతి జావాద్వీపంవరకు పాకింది. ఆ దేశీయులూ భగవద్గీతను అనుసరించారు. వారికి తాము అనుసరించేది భగవద్గీత అని తెలుసునో తెలియదో? అది మనదేశపు పుస్తకమని కూడా బహుశః వారు ఎరిగివుండరు. ఇప్పుడు వారు ఇస్లాంమతం అనుసరిస్తూ ఉన్నప్పటికీ విశేషమైనరోజులలో రామాయణ భారతాది కథాప్రదర్శనాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. మనకంటె వారికి ఆంజనేయుడు, సీత, రాముడు అంటే అధిక గౌరవం. వారికిన్నీ మన భగవద్గీత ఉన్నది. ఈ విశిష్టతకు కారణమేమిటి?
ఈ విషయంలో నేను అప్పుడప్పుడు ఆలోచించేవాడను. భగవద్గీత ఒక మహత్తరమైన ఉపదేశగ్రంథం. ఈ ఉపదేశం ఎట్టి చోటులో జరిగింది? ఉపదేశానికి అనుకూలమైన స్థలం ఉండాలి. అదొక ప్రశాంత స్థానంగా ఉండాలి. ఆ చోటు రమణీయంగా ఉండాలి. ఏ ఆరామమో, ఏ నదీతీరమో ఉపదేశానికి తగినచోటు. ఎందుకంటె అక్కడ కావలసిన ప్రశాంతత, రామణీయకత సులభంగా లభిస్తవి. అట్టిచోటులలోనే జ్ఞానోపదేశం గురువు చేయగలడు. శిష్యుడున్నూ గ్రహించగలడు. ఇట్టి ప్రదేశాలలోనే మహరులు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లు చూస్తున్నాము. నలువురు శిష్యులకు ఉపదేశిస్తున్న భగవత్పాదులవారి చిత్తరువును మనము చూచే ఉన్నాము. ఒక కుటీరం. దూరంలో కొండలు, పచ్చని నేలమధ్యలో గురువు, ఇటూ అటూ నలువురు శిష్యులు - 'జలరమణీయం, స్థలరమణీయం' - అన్నట్టు ఉంటుంది. ఆ దృశ్యమే ప్రశాంతంగా ఉంటుంది. 'ఉపదేశానికి ఎంత అనుకూలమైనచోటు' అని అనిపిస్తుంది. భగవద్గీతోపదేశం దీనికి విరుద్ధంగా, ఉభయ సేనామధ్యంలో, అష్టాదశ అక్షౌహిణుల కలకలంలో జరిగింది. ఏక్షణం ఏది జరుగుతుందో తెలియదు. ఎవరు ఉంటారో, ఎవరు పోతారో నిశ్చయంలేదు. కానీ చావుకుముందు రెండు నిమిషాలకాలం లభించినా, ఆ స్వల్పకాలంలోనే 'నహి జ్ఞానేవ సదృశం పవిత్ర మిహవిద్యతే' అన్న జ్ఞానోపదేశంనడిచింది. ఈకారణం చేత భగవద్గీతకు ఒక గొప్పస్థానం చిరకాలంగా ఏర్పడినదని మనం అనుకోవచ్చు. ఆశ పూర్తిగా అంతరించిపోయినపుడు, ప్రాణాలు ఉంటవో పోతవో అన్న నిశ్చయం లేనపుడు, దేహముపై ధ్యాసపోయినపుడు అహంకార మమకారములు నశించి పోయినపుడు గీత ఉత్పన్నమైనది. దానిచేతనే దానికి అంతఖ్యాతి వచ్చింది.
పండుగలలో దీపావళినిపరికింతాం. దీపావళి భగవద్గీతకు అన్నగారని చెప్పాలి. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం. మలయాళీకులకు 'ఓణం' గొప్ప అయితే, ఔత్తరాహులకు 'హోళీ' ఎక్కువ. ఒకజాతి చేసుకొనే పండుగ మరొకజాతి చేసుకొదు. కాని ఈదీపావళిమాత్రం అందరూకలసి దేశవర్ణ వ్యవస్థలేకుండా ఆబాలగోపాలం సంతోషంగా జరుపుకొంటారు. ఇతర దేశాల నుండి వచ్చినవారుకాక. మనదేశంలోనే వుండే బౌద్ధులూ జైనులూ ఈ పండుగ పాటిస్తారు. మనదేశమంతా ఆసేతు హిమాచల పర్యంతం దీనిని జరుపుకోవడం మనం గమనించవచ్చు. మనవైపు బాణసంచా, పటాసులు, మందుసామానులు కాలుస్తుంటాము. కానీ ఔత్తరాహులువీనితో పాటు దీపావళి- వరుసగా ప్రమిదలలో చమురుపోసి జ్యోతులను వెలిగించడం ఏర్పాటుచేస్తారు. దాన్నిచూచే నేను మఠంలో అదేవిధంగా జ్యోతులను ఎక్కువగా వెలిగించుమని ఇరవై ముముప్ఫై ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఔత్తరాహులకు కార్తిక పౌర్ణమికి మరుసటిరోజు ఈ పండుగ. ఎట్లున్నా ఉత్తరాదివాళ్లకై తేనేమి దక్షిణాదివాళ్లకై తేనేమి దీపావళి ఒకరోజుననే
, ఎన్నో పండుగలూ, కర్మలూ ఉన్నా తక్కినవానికిలేని ఖ్యాతి ఈదీపావళి కెందుకు ఏర్పడింది?
ప్రస్తుతం అస్సాం అనబడే దేశంలో ప్రాగ్జ్యోతిషమనే నగరంలో భౌముడనే రాజు పాలించేవాడు. అతనికే నరకాసురుడని పేరు. అతడు స్త్రీలను చెరపట్టి సాధువులను హింసించేవాడు. అతడు తపస్వియే. కాని తానుతపస్సుకు ప్రతిఫలంగా వరాలు పొంది ప్రజాహింస చేస్తుండేవాడు. వాడు చేస్తుండిన లోకహింస చెప్పరానిది. అతడు అజేయుడు. అభేద్యమైన దుర్గాలలో ఉండేవాడు. అందుచేత వాని సంహారానికి భగవంతుడే అవతరించవలసివచ్చింది. అవతరించి వానిని యుక్తిగా సంహారం చేశాడు. వాని సంహారకాలంలో వాని తల్లి భగవానుని ప్రార్థించినదట.
స్త్రీలను పుత్రశోకంకంటే గొప్ప శోకం వేరే లేదు. భర్తచనిపోతే మనకున్నరక్షణ పోయినదే, మన సౌకర్యాన్ని చూచేవా రెవరు? ముత్తైదువలమైన మాకు హేయమైన వైధవ్యం ప్రాప్తించినదే యని స్త్రీలు అధికంగా దుఃఖించవచ్చు. ఈ దుఃఖంలో కొంత స్వార్థం కనపడుతుంది. కాని పుత్రవిషయం వేరు. కొడుకువయస్సు చనిపోయేటపుడు ఎంత అధికమో తల్లి దుఃఖం అంతఅధికమౌతూ ఉంటుంది. నరకుడు లోకాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన ప్రభువు. అట్టి కొడుకు భగవానునిచేత హతుడైనాడు. కాని నరకుని తల్లి లోకానికి విరుద్ధంగా పుత్రశోకం పొందకుండా, భగవంతునిచేతిలో చచ్చిన తన కుమారుని మరణానికి దుఃఖించడానికి బదులు సంతోషించింది. తనకొమరునికి భగవద్దర్శనం కల్గింది. ఎంత అదృష్టం ఉంటే. ఎంత తపస్సుచేస్తే ఆభాగ్యం లభిస్తుంది! 'నాపుత్రుడు చనిపోతే పోనీ, నాకు పుత్రశోకంకల్గినా ఫరవాలేదు. లోకులకు ఏవిధమైన కష్టమూ ఉండరాదు. నా కొమారుడు చనిపోయిన రోజు లోకులకు పండుగకానీ, ఆరోజు వాళ్ళు అభ్యంగనం చేసుకొని, కొత్తబట్టలను కట్టుకొని, విందులు చేసుకొని సంతోషపడనీ' అని ఆ తల్లి భగవానుని ప్రార్థించినదట, అవసాన సమయంలో భగవద్దర్శనం మూలంగా కల్గిన జ్ఞానంతో నరకాసురుడే ఈవిధంగా తనస్మృతిచిహ్నంగా ప్రజలు పండుగ చేసుకోనీ అని భగవంతుని ప్రార్థించినట్లున్నూ ప్రతీతి.
ఆరోజు ఎవరెవరు అభ్యంగనస్నానం చేస్తారో వారికి గంగాస్నానఫలం, మహాలక్ష్మి అనుగ్రహం కలుగవలెననినరకాసురుడు ప్రార్థించాడట. పన్నెండు నెలలలో ప్రతినెలకున్నూ ఒక్కొక్క పురాణమున్నది. చైత్రమాహాత్మ్యం, వైశాఖ మాహాత్మ్యం అని ఒక్కొక్క నెలను ఉద్దేశించి చెప్పబడిన పురాణాలున్నవి. వానిలోతులామహాత్మ్యమొకటి. అది ముప్పది అధ్యాయాల గ్రంథం, దానిని ముప్ఫై రోజులూ చదువవచ్చు. అందులో దీపావళిని గూర్చిన అధ్యాయంలో 'తైలే లక్ష్మీః, జలే గంగా' అని ఉన్నది-ఆరోజు గంగ లేనిచోటునైనాసరే, తలంటుకొని. వేడినీటిలో స్నానంచేసినవారికి గంగాస్నానఫలం కల్గుతుందని చెప్పబడింది. అన్ని ఆశ్రమములవారున్నూ, వారాగులైన సన్యాసులతో సహా దీపావళినాడు స్నానంచేయవలెనని తులాపురాణం చెపుతున్నది.
ఈపండుగ వెనుక, పుత్రశోకం కల్గినా లోకక్షేమం కాంక్షించిన ఒకతల్లి ప్రార్థన ఉన్నది. ఇంతకంటే చిత్తశుద్ధిని మనం వేరే ఎక్కడ చూడగలం? మనమైతే ఈ విధంగా ప్రార్థించి ఉండేవాళ్ళమా? 'నాకొడుకుచనిపోయినాబాధలేదు. లోకం క్షేమంగా-ఉండాలి' అన్న కోరికలో ఎంతటి మహత్తర త్యాగం ఉంది? ఏదో పుక్కిటిపురాణమని త్రోసివేయకుండా తరతరాలుగా ఈపండుగ చేసుకుంటూఉన్నాము. మధ్యలో ఆపివేయబడక పెద్దలనుండి సంక్రమించిన దీ పండుగ. దీనిని అనుసరించినందువల్ల, మనకు కల్గే ఆత్మలాభమేమిటి? ఈవిషయాన్నైనా స్థూలంగా పరిశీలిస్తే చాలదు. సూక్ష్మంగాకూడా మనం తరచి చూడాలి.
మనకు ఎన్నో ఆపదలూ, కష్టాలూ కలుగుతూఉంటవి. ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. దానికి తగినట్లే దుఃఖాన్నీ అనుభవిస్తుంటాము, 'మనం తప్పుచేసినాము. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాం' అని ఒక్కొక్కప్పుడు మనకే తోస్తూ ఉంటుంది. ఇంకాకొన్ని దుఃఖాలు, కష్టాలూ మనలను చుట్టుకొన్నప్పుడు 'అయ్యో! నేనేపాపమూ ఎరుగనే? నాకెందుకీకష్టం? దేనికీబాధ!' అనీ అనుకొంటాం. కారణం తెలుసుకొన్నప్పుడు మనలను మనమే ఓదార్చుకొంటాం. కారణం తెలియనప్పుడు మనకు మరింత దుఃఖం కలుగుతుంది. ఐతే అన్ని కార్యాలకున్నూ మనకు కారణం తెలిసియేతీరవలెనన్న నియమమా ఏమి? కారణం తెలియని కష్టాలూ ఎన్నో కలుగవచ్చును. కారణం తెలిసినవీ కలుగవచ్చు. ఏది ఎట్లున్నా మనకు కలుగ వలసిన కష్టం కలిగేతీరుతుంది. కలుగవలసిన దుఃఖం కలుగుతూనే ఉంటుంది. మనం కష్టపడుతున్నాం కదా ఇతరులూ దుఃఖించనీ, లోకమూ కష్టపడనీ అన్న మనోభావం మనకు ఉండరాదు. 'మనకు బాధకల్గినా ఫరవాలేదు. లోకం క్షేమంగా ఉండాలి' అన్న నీతిని దీపావళి బోధిస్తుంది.
మానవులముగా పుట్టినాము. దానివలన మనకు కష్టములే సంప్రాప్తమౌతూ ఉంటవి. సుఖం ఎప్పుడో ఒకప్పుడు లేశమాత్రంగా చేస్తుంటాము. పై పదవులలో ఉన్నవారికి కష్టాలు తక్కువ అని అనుకోరాదు. పదవి పైకిపోయేకొద్దీ కష్టమూ అధికమే. మేడమీదనుండి క్రిందపడితే ప్రాణానికే ఆపద. అరుగుమీదనుండి క్రిందకు జారితే ఏదో చిన్నగాయం మాత్రం కావచ్చు. ప్రతివారి జీవితంలోనూ దుఃఖం అంతర్వాహినిలా ఉండనే ఉంటుంది. మన దుఃఖాన్నే మనం గొప్ప చేసుకోరాదు. మన కష్టం నిజంగానే దుర్భరంగా ఉండవచ్చు. కానీ మన బాధలను మనం సహించుకొని లోకక్షేమం కాంక్షిస్తూ పాటుపడాలి! ఉపదేశ గ్రంథాలలో గీతకెంత ప్రఖ్యాతి ఉన్నదొ పండుగలలో అట్టి ప్రఖ్యాతి దీపావళి మనకు స
ూచిస్తుంది.
ఇంతేకాదు, ఈకథలో మరొక్క సత్యముంది. కొందరు భక్తితో ఉపాసిస్తారు. తపస్సుచేస్తారు. భగవత్సాన్నిధ్యం పొందుతారు. కొందరు అక్రమాలు చేస్తారు. అన్యాయాలు చేస్తారు. భగవద్దూషణచేస్తారు. వారిని సంహారంచేయడంకోసం భగవంతుడు అవతరిస్తాడు. సంహారవ్యాజంతో తన దర్శనాన్ని ఇచ్చి వారికి పాపవిముక్తిచేసి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని దీనివల్ల మనం తెలుసుకొంటున్నాము. కంస, రావణ, శిశుపాలాదులు ద్వేషభావంతో భగవత్సాయుజ్యం పొందినవారు.
భవభూతి ఒకగొప్పకని, భవుడనగా ఈశ్వరుడు. భూతియనగా విభూతి. భవభూతి విభూతిపూసుకొని సదాశివస్మరణ చేస్తూ ఉండిన పరమభక్తుడు, ఆయన ఉత్తరరామచరిత్ర అనే ఒకనాటకం వ్రాశాడు. ఆ నాటకములో రాముడు కథానాయకుడు. శంబుకుడనేవాడొక శూద్రుడు. ఇతడు తన వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధమైన ఒకపనిచేశాడు. అది తపస్సు. ఆ కారణంచేత రామరాజ్యంలో ఒకశిశువు అకాలమరణం చెందినదని తలచి శంబుని వధించడానికి శ్రీరాముడు సన్నద్ధుడై వెడతాడు. కృపాణపాణియైన రాముడు అంటాడు.
రే హస్త దక్షిణ మృతస్య శిశో ర్ద్వజస్య
జీవాతవే వీసృజ శూద్రమునౌ కృపాణమ్,
రామస్య బాహు రసి దుర్భర గర్భఖిన్న
సీతావివాసనపటోః కరుణా కుత స్తే ?.
- ఉత్తర రామచరిత.
కరవాలముబూనిన దక్షిణహస్తాన్ని సంబోథిస్తూ శ్రీరాముడు అడుగుచున్నాడు. ''ఓ హస్తమా! ఈత-డు చేసిన తప్పేమిటి? అది వధార్హమేనా? నీకు ఏమాత్రమైనా దయ ఉన్నదా? జాలి ఉన్నదా? ఏ జోక్యము లేకుండా ఒకమూల తపస్సు చేసుకొంటున్న ఈ మునిని నీవు చంపడానికి పాల్పడినావు కదా? చంపు! చంపు! నీవు రాముని చేతివి గదా? రామునిచేతికి కరుణ అనే దొకటున్నదా! పూర్ణగర్భిణి ఐన సీతను ఎవడో చాకలి దూషించినాడన్న నేరానికి అణుమాత్రమైనా జాలిలేక అంతఃపురంనుండి అరణ్యానికి పంపిన చేతివికదా! నీకు ఏమి కరుణ ఉంటుంది? వర్ణాశ్రమధర్మానికి విరుద్ధంగా నడచుకొన్నాడనేకదా! ఈతని వధించబోతున్నావు. ఇతడు ఏ పాపమూ ఎరుగడుకదా! ఊ, చంపు చంపు.
శంబుకుడు రాముని చూస్తాడు. ''రామా! నేను తప్పుచేశాననేకదా నీవు చంపడానికి వచ్చావు. నీవు వచ్చిన పని కొనసాగించు. కాని నేనుచేసిన పనిమాత్రం తప్పు అని చెప్పవద్దు. దేన్ని లక్షించి ఇంతకాలం తపస్సుచేశానో అది నాకు లభించింది. నేను తప్పు చేసిఉంటే నాకు నీ దర్శన భాగ్యం లభించిఉండేదేనా? నా తపస్సు నీ దర్శనంకోసం. అది లభించింది. ఇక నాతపస్సు తప్పు ఎట్లా ఔతుంది? అందరూ నీ దర్శనాన్ని అభిలషించేకదా తపోనిరతులౌతున్నారు? ఆభాగ్యం నాకు అనాయాసంగా కల్గింది.'' అని రామునితో అంటాడు.
ఇట్లాభగవంతుడుఅపరాథినీ అనుగ్రహిస్తున్నాడు, ఆరాధకులనూ అనుగ్రహిస్తున్నాడు. తపస్సుచేసేవారికే వేలకొలది సంవత్సరాలు శ్రమించినా భగవత్ జ్ఞానం కలగటంలేదు. కాని భగవానుని ద్వేషిస్తున్నవానికే. దూషిస్తున్నవానికే భగవచ్చింతన అవిరామంగా ఉంటూవుంటుంది. 'దేవుడు లేడు. దేవుడు లేడు' అని దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు. అందుచేతనే భక్తునికంటె ద్వేషికి భగవద్దర్శనం శీఘ్రంగా కలుగుతుందని చెప్పుతుంటారు.
కొందరికి ద్వేషకారణంగానూకాక, భక్తి కారణంగానూ కాక భగవద్దర్శనం కలుగుతుంటుంది. అట్టి సన్నివేశం పద్మపాదుల జీవితంలో చూడగలం. పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది పురశ్చరణకోసం అహోబలక్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చున్నారట. ఒక ఎరుకు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారనిన్నీ తాను ఏదైనా చేయగలది ఉన్నదా యనిన్నీ పరామర్శించినాడట. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనంలోకి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకు అన్నాడు. ఉందని పద్మపాదులు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకుకు చెప్పాడు. అంతటితో ఆఎరుకు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు. అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు. తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. మరొకసమయంలో తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు. శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారట. ఈ ఆటవికునికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే. నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణే అతనికి ధ్వేయమైంది. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచే
తనే అతనికి భగవద్దర్శనం కల్గింది.
భక్తికంటె ద్వేషం పెద్దది. దానికంటె లక్ష్యమూ, సత్యమూ గొప్పది. సత్యమొక్కటే లక్ష్యంగా ఉంచుకొని దానిని ప్రాణాలకంటె గొప్పదిగాభావిస్తూ, దానిని ఈశ్వరార్పణ చేస్తే ఈశ్వరానుగ్రహం అతిశీఘ్రంగా కల్గుతుందనేటందుకు పై చెప్పినది నిదర్శనం.
మన సుఖదుఃఖాలు మనతో ఉంటవి. వానిని పెద్దగా తలచి వానితోనే సతమౌతూ కూర్చోకుండా మనవల్ల ఈ లోకానికి ఏమాత్రమైనా సుఖం కలుగనీ అన్న భావన ఉంటే, ఆ భావన రూఢికావాలని మనం ప్రార్థించకల్గితే అది ఎంతో విశేషం. దీపావళివంటి పండుగవల్ల మనం తెలుసుకోవలసిన పాఠం ఇదే. మన కష్టాలను ఒకవంకకు నెట్టి, మన దుఃఖాలను లెక్కించకుండా లోకక్షేమం కోసం పాటుపడదామని మనం ఎల్లపుడూ సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.
Comments
Post a Comment