జన్మాష్టమి రోజున ఇలా చేస్తే - Vishwagurunidhi

జన్మాష్టమి రోజున ఇలా పూజ చేస్తే.. శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే?


శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లున్నాయి. అలాంటి మహిమాన్వితమైన రోజున శ్రీ కృష్ణ భగవానుడిని పూజించడమే కాకుండా శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించాలి.

శ్రీ కృష్ణాష్టమి వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండపురాణం, స్కాందపురాణం, మార్కండేయ పురాణాల్లో కనిపిస్తోంది. పూర్వం నారద మహర్షి ఓ సారి సత్యలోకానికి చేరుకుని బ్రహ్మదేవుడిని దర్శించి.. స్వామిని శ్రీకృష్ణాష్టమి మహాత్మ్యమును గురించి వివరించాల్సిందిగా కోరాడు. ఆ సమయంలో నారదునికి స్వామి శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని గురించి తెలిపాడు.

ఈ రోజున శ్రీకృష్ణుని పేరును స్మరించినంతనే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలై.. పుణ్య ఫలాలు కలుగుతాయి. అలాంటి శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించాలి. ఆరోజున పగలంతా ఉపవాసం వుండి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ గడిపి వ్రతం చేయాలి. పూర్వం అంబరీషుడు, గాధిమహారాజు వంటివారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గొప్పవారయ్యారు ఎందరో మహామునులు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణులోకాన్ని పొందారు.

ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల భయాలు తొలగిపోతాయి. వ్యాధులు నయమవుతాయి. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని బ్రహ్మదేవుడు నారదునికి వివరించాడు. ఈ వ్రతం గురించి తెలుసుకున్న నారదుడు.. సకల లోక వాసులకు ఈ వ్రతాన్ని గురించి తెలియజేసినట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

ఈ వ్రతం ఆచరించేవారు.. శ్రీకృష్ణాష్టమి ముందురోజు రాత్రి ఉపవాసం వుండి పవిత్రంగా గడపాలి. శ్రీకృష్ణాష్టమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి.. నువ్వులపిండిని శరీరానికి, ఉసిరిక పిండిని తలకు రుద్దుకుని.. తులసీ దళాలతో కూడిన నీటితో స్నానమాచరించాలి. ఇంటిల్ల పాది శుభ్రం చేసుకుని.. పూజా మందిరాన్ని సుందరంగా అలంకరించుకోవాలి.

చిన్ని పాదాలను గుర్తించుకోవాలి. తర్వాత ఆచమనం చేసి ఉపవాసం వుండి వ్రతం కోసం సంకల్పించుకోవాలి. శ్రీకృష్ణుడిని పూజించాలి. పగలంతా ఉపవాసం వుండటం ద్వారా సప్తజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అగ్ని పురాణం చెప్తోంది. శ్రీకృష్ణ వ్రతం చేయడం ద్వారా వెయ్యి గోవులను దానం చేసిన ఫలం కలుగుతుందని విశ్వాసం.

శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీమద్భాగవతం దశమస్కందంలోని శ్రీకృష్ణ జననం, బాల్య క్రీడలు వంటి వాటిని చదవటం లేదా వినడం చేయాలి. ఆ రోజు సాయంత్రం పూట తిరిగి స్నానమాచరించి, ఇంట్లోని పూజా మందిరాన్ని, ఇంటిలో వ్రతం చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పూజా పీఠంపై బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి.

పీఠం మధ్యభాగంలో బియ్యం పోసి, బియ్యంపైన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని, చిత్ర పటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. నీరు, ఇనుము, కత్తి, గుమ్మడి పండు, పోకపండు, కరక్కాయ, మారేడు పండు, దానిమ్మ పండు, జాజి పండు, కొబ్బరి పండు, జింజీర ఫలం వంటి వాటిల్లో ఏవైనా ఎనిమిదింటిని వుంచాలి.

ముందుగా గణపతి పూజ చేసి.. తర్వాత శ్రీకృష్ణుడిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. పాలు, మీగడ, వెన్న, పెరుగు, నెయ్యి, చక్కెర కలుపుకోవాలి. శక్తి మేరకు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఆపై వ్రతకథను చదివి అక్షతలు వేసి నమస్కరించాలి. ఇలా వ్రతాన్ని పూజించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి. మరుసటి రోజు తిరిగి స్వామిని పూజించి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ప్రతి ఏడాది శ్రీకృష్ణాష్టమి నాడు వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి.
హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే, మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా!

శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసకోవాలి.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్‌, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చ

దువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.

కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్లు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు... బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి, ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.

ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ... పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్‌ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించిచి, ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు?

Comments