మణిద్వీపం... వైకుంఠం, కైలాసం కన్నా అద్భుతం - Vishwagurunidhi

మణిద్వీపం...
వైకుంఠం, కైలాసం కన్నా అద్భుతం...
అక్క‌డే జ‌గ‌న్మాత నివాసం



శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉంటుంది. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై ఉంటారు.
దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

Comments