యోగ మాయ నర్తనకేళి.. భద్రకాళి - Vishwagurunidhi

యోగ మాయ నర్తనకేళి.. భద్రకాళి

కాళికాదేవి అవతారాలలో ‘భద్రకాళి’ అవతారం, ఆ రూపం చాలా ప్రసిద్ధమైనవి. భద్ర శబ్దానికి మంచి, శుభం అనే అర్థాలున్నాయి. సంస్కృతంలో ‘భ’ అంటే మాయ. ద్ర అంటే అధికమైనది. అన్నిటి కన్నా అధికమైన మహామాయ కాళి అని దీని అర్థం. మన తెలుగురాష్ట్రాల్లో ప్రాచీన కాలం నుంచి కాళీ ఆరాధన ఉంది.

వరంగల్‌లో భద్రకాళి ఆలయం ప్రసిద్ధమైనది. మురమళ్ల వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆరాధన ఉంది. ఈ మహామాయేనే యోగమాయగా.. కాళికగా పూజిస్తారు. ఒకసారి యోగ మాయ ప్రభావంతో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకోగా.. ఆ సమయంలో లోకమంతా అరాచకం ప్రబలిపోయింది. అప్పుడు బ్రహ్మ కాలస్వరూపిణి అయిన ఆ యోగమాయను ప్రార్థించగా.. ఆ తల్లి కాళికా అవతారములో వచ్చి తన మాయను విష్ణువు మీద నుంచి ఉపసంహరిస్తుంది. దీనితో విష్ణువు యోగనిద్ర నుంచి లేచి మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షిస్తాడు. సాధారణంగా విశ్వరూపం అంటే శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు.

కానీ యోగ వాశిష్టంలో కాళికాదేవికి సంబంధించిన విశ్వరూప వర్ణన కనిపిస్తుంది. ‘ప్రళయకాలంలో అంధకారమైన ఆకాశంలో, ఛాయా రూపాన్ని ధరించి. అగ్నిజ్వాలల మధ్య.. అతి దీర్ఘమైన రూపాన్ని ధరించి ప్రకాశిస్తోంది. ఆమె రూపం అనంతమైన విశ్వమంతటా వ్యాపించి ఉంది. అనంతమైన ఆ దేవి శిరస్సును చూడాలంటే ఆకాశంలోకి.. పాదాలను చూడాలంటే పాతాళంలోకి ప్రయాణం చేయాలి. ఇక తాండవ సమయంలో ఒక్క క్షణం ఒంటికాలి మీద ఆడుతున్నదా అనిపిస్తుంది. మరుక్షణంలో వందల కాళ్లతో నర్తిస్తున్నదా? అనిపిస్తుంది. ఇంకొక క్షణం అసలు పాదాలు లేవా అన్నంత వాయువేగంతో నర్తిస్తోంది. పోని ఆమె ముఖాన్ని దర్శించుకుందామా అంటే కొంత సేపు ఒకే ముఖంతో.. మరి కొంత సేపు వేల, లక్ష ముఖాలతో.. అసంఖ్యాకమైన చేతులతో కనిపిస్తోంది.

ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసముల తీవ్రతకు మేరు పర్వతాలు ఎగిరిపోయేటట్లుగా ఉన్నాయి. మలయ, సహ్య, మందర మొదలైన పర్వతాలు ఆమె కంఠంలో వ్రేలాడుతున్న మాలలాగ కనిపిస్తున్నాయి. రజత వర్ణంలో హిమాలయం, సువర్ణ వర్ణంలోని సుమేరు పర్వతం ఆమె చెవులకు ఆభరణములుగా వెలుగొందుతున్నాయి. మూడు లోకాలు ఆమెకు ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. అఖిల బ్రహ్మండాలు ఆమె నడుముకు కట్టిన మేఘాల వడ్డాణంలా భాసిల్లుతున్నాయి. సమస్త లోకములు, బుతువులు, రాత్రిపగలు- ఆమె శరీర అవయవములు అయ్యాయి..’’ - అనే కాళి వర్ణన చదువుతుంటే అనిర్వచనీయమైన

అనుభూతి కలుగుతుంది.

Comments

  1. Most respected Sir, Hearty Namaskar. Is there any possibility to get more particulars of chayapurush sadhana?

    ReplyDelete

Post a Comment