మహకాళి తత్వం - Vishwagurunidhi


రజోగుణ ప్రధానంగా ఐశ్వర్య కాళి, భద్రకాళి రూపాలుంటాయి. తమోగుణ ప్రధానంగా ఉగ్రకాళి రూపం ఉంటుంది. కాళిదేవిని యుద్ధ స్వరూపిణిగా, తీవ్ర స్వరూపిణిగా భావించే చిత్రపటాలు గీసింది రాజా రవివర్మ. ఆయన గీసిన చిత్రాలలో అమ్మవారి రూపం భీకరంగా ఉంటుంది. నాలుక బయటకు చాచి ఉంటుంది. చాలా మంది అది క్రోధ స్వరూపంగా భావిస్తారు. కానీ అది దేవతను గుర్తుపట్టే ఒక చిహ్నం మాత్రమే.

రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి కాళీమాత తన నాలుకను చాస్తుంది. అంటే రాక్షస సంహారం వేళ మాత్రమే ఆమె నాలుకను చాచింది తప్ప అంతకు పూర్వం లేదు. తన భక్తులతో మాట్లాడేటప్పుడు ఆ నాలుక బయటకు ఉండదు కదా! ఆమె తన నాలుక సాయంతో ఆ రాక్షస సంహారం చేసి, భక్తులను రక్షించింది కాబట్టి ఆ నాలుకను చూసినప్పుడు అమ్మ తమను ఎలా రక్షించిందో అన్న విషయం గుర్తు చేసుకోవాలి.

చాలా మంది ఇంద్రియ నిగ్రహం కోసం- నాలుకను చాచి ఉన్న కాళీ రూపాన్ని పూజిస్తారు. తెనాలి రామకృష్ణుడికి, కాళిదాసుకు- వారి నాలుకలపై బీజాక్షరాలను లిఖించి అనంతమైన వాక్‌శక్తిని, వాచ్‌చాతుర్యాన్ని అనుగ్రహించినట్లే తమకు కూడా అనుగ్రహిస్తుందని చాలా మంది ఈ రూపాన్ని పూజించడానికి ఇష్టపడతారు. కాళీ దేవి రకరకాల రూపాలలో తన భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమె శారద స్వరూపిణిగా విద్యను, సంతాన కాళిగా సంతానాన్ని, భద్రకాళిగా అధికారాన్ని, ఐశ్వర్య కాళిగా ఐశ్వర్యాన్ని, చంద్రకాళిగా మనశ్శాంతిని అనుగ్రహించగలదు. మహాకాళిగా దుష్టసంహారాన్ని చేస్తుంది.

Comments