తంత్ర శాస్త్రం - తాంత్రికుడు



*తంత్ర శాస్త్రం - తాంత్రికుడు
*ఉపక్రమణిక :*
కొన్ని పదాలకు వాడే అసలైన అర్థం కాక దురర్ధం రావడం కద్దు. అటువంటి పదాలలో "తంత్ర శాస్త్రము", "తాంత్రికుడు" అనేవి కూడా ఉన్నాయి ఈయన గొప్ప తాంత్రికుడు అని ఎవరినైనా పరిచయం చేస్తే చాలామందికి వెంటనే కలిగే భావం భయం. కనీసం కొంత  బెరుకు. ఎందుకంటే  తాంత్రికుడు అనగానే చేతబడి చేసే వాడని ,బాణామతి చేసేవాడని..... అలాంటివారికి దూరంగా ఉండడం మంచిదని సహజంగా అనిపిస్తుంది. దానికి కారణం లోకంలో తాంత్రికులుగా చెలామణి అవుతున్న వారిలో చాలామంది అలాంటివారు కావడమే .తమ స్వార్థ ప్రయోజనాల కోసం... తాపత్రయపడే కొందరు కుతంత్ర ప్రవీణుల వల్లనే...తాంత్రికులకు,తంత్ర శాస్త్రానికి ఈ సమస్య.
     తంత్రం ఆధ్యాత్మిక భావనలు కంకితమైన ఉదాత్త ప్రక్రియయే...గానీ, స్వార్థపర కృత్యాలకు తాకట్టు పడి ఉండే క్షుద్ర ప్రక్రియ కాదు. నిస్వార్ధ ఆధ్యాత్మికవేత్తగా భాసిస్తూ.... సమాజసేవలో తన శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తూ,త్యాగ నిరతితో ప్రకాశించే యోగివరునికే తాంత్రికుడనిపించుకోగలిగిన అర్హత,యోగ్యత ఉన్నాయి.
     తంత్రం అంటే సమాజ కళ్యాణ ప్రక్రియ.సమాజ క్షేమానికి దగ్గర బాట. మంత్రం,క్రియ.... రెండింటి సంయోగం తంత్రం అనవచ్చు.మంత్రం శబ్ద పరంగా ఉండవచ్చు.ముద్రల ద్వారా వెల్లడి కావచ్చు. తంత్ర శాస్త్ర బోధన లో గురువు, నిశిత పరిశీలన చేసి.....శిష్యులను ఎంపిక చేసుకుంటాడు. అర్హత,యోగ్యత చూడకుండా తంత్రోపదేశం చేస్తే....అది దుర్వినియోగం జరుగవచ్చు.కావున గురువు జాగ్రత్త వహించి, విచక్షణా పూర్వకంగా వ్యవహరిస్తాడు.
 *రహస్యం :*  రహస్యంగా ఉంచబడింది అంతా చెడు కాదు. ఉదాహరణకు భగవంతుని ప్రతిజీవిలోనూ ప్రాణాన్ని ఉంచాడు.  ప్రాణం పోయిన శరీరంలో చైతన్యం అంతరించడం మినహా , ఏ తేడా కనిపించదు.  భగవంతుడు ప్రాణాన్ని ఎక్కడ దాచింది ఎవరికీ తెలియదు కదా! అంత మాత్రం చేత అది చెడు కాదు. ఒకరు మెదడుకు సంబంధించిన వ్యాధితో చనిపోవచ్చు. అంత మాత్రం చేత అతని ప్రాణం మెదడులో అనుకోవాలా? మరొకడు గుండెజబ్బుతో మరణిస్తాడు. అతని ప్రాణం గుండెలో ఉందను కోవాలా?   ప్రాణాన్ని ఎక్కడ దాచింది దాచిన పరమేశ్వరుడు ఒక్కడికే ఎరుక.  రహస్య గోపనమే తంత్రము ఐతే....ఆ భగవంతునికి మించిన తాంత్రికుడెవరు?
      నిజానికి తంత్ర శాస్త్రం ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించింది. అది కూడా రహస్యమే. తంత్రం కొన్నిటిని మాత్రమే వెల్లడి చేస్తుంది.అందువల్ల కొంతమందికి... తంత్రమంతా ఒక మోసంలా అనిపించవచ్చు. కానీ మోసం అంటూ ఏదైనా ఉన్నా,  అది సమాజ సంక్షేమానికి ఉద్దేశించబడిందే.
     ఒక చిన్న పిల్లకు....సూస్తీ చేసిందనుకోండి. చేదు మాత్ర మింగిద్దాం అనుకుంటే...మింగుతుందా? మరేం చెయ్యాలి.దాని పైన పంచదార పోస్తాం. హాయిగా మింగేస్తుంది. చేదును తీపి అనిపించేలా చెయ్యడం మోసం అంటామా? కానీ అది ఒక మంచి పనికే కదా! చేదు మాత్ర అని చెబితే ఆ చిన్నపిల్ల ...మాత్ర మింగదు కదా? ఇక్కడ మాత్ర మింగించడమే ముఖ్యము. తంత్ర శాస్త్రం విషయంలో కనిపించే రహస్యం కూడా ఇదే.
 *నిజమైన తాంత్రికుడు :*
    మేలు చేసే వాడే నిజమైన తాంత్రికుడు. అంతేకాదు.... తాను చేసే మేలు మరొకరికి తెలియాలన్నా తాపత్రయం అతనికి ఎక్కువగా ఉండదు. అతనికి కావలసింది సమాజ కళ్యాణమే, గాని పేరు ప్రచారము కాదు. తన కుడి చేయి చేసే మంచి పనిని ఎడమచేతికి కూడా తెలియని అవసరం లేదని భావిస్తాడా నిష్కామ కర్మిష్ఠి.  ఎవరికి మేలు జరిగిందో.... ఆ వ్యక్తి కూడా తనకు జరిగిన మేలుకు ఫలానా తాంత్రికుడు చేసిన ప్రక్రియ కారణం అని తెలియాల్సిన అవసరం లేదని నిజమైన తాంత్రికుడు విశ్వసిస్తాడు.
 తాంత్రికులు రకరకాలుగా ఉంటారు ప్రధానంగా తంత్ర శాఖలో దక్షాచారము, వామాచారము వంటి తేడాలు కనిపిస్తాయి .అవన్నీ ఋషి ప్రోక్తాలే. అన్నీ సమాజ కళ్యాణానికే. దక్షాచార,వామాచారాలలో..... దక్షాచార ప్రయోగాలు క్లిష్టమైనవి. దుర్వినియోగానికి అవకాశం తక్కువ. వామాచార ప్రయోగాలు, దక్షాచారంతో పోలిస్తే....కొంత తేలిక. దుర్వినియోగం చేసే వీలెక్కువ. అందుకే వామాచార ప్రక్రియలు...క్షుద్ర తంత్రాలుగా....అపకీర్తిపొందాయి. అయితే వామాచారుల్లో కూడా స్వార్ధ త్యాగులైన యోగులున్నారు. కాబట్టే,  తంత్రశాస్త్రానికి, కొందరు స్వార్ధపరులవల్ల అపకీర్తి కలిగినా, నేటికీ అది సమాజ కళ్యాణానికి చక్కని ఉపకరణం.
      ఆదిశంకరులు స్వయంగా ,తాంత్రిక ప్రక్రియలలో సిద్ధహస్తులు. తాను రచించిన "సౌందర్యలహరి"లో ఆయన ఎన్నో క్లిష్టమైన తాంత్రిక ప్రక్రియలను రహస్యాలను నిక్షిప్తం చేశారు. శంకరాచార్యులు వంటివారు తంత్ర శాస్త్రాన్ని సమాజశ్రేయస్సుకు చక్కగా వినియోగించుకుని దానికి ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చేశారు.
      పూర్వకాలం మహర్షుల వలే అటువంటి నిస్వార్థ సేవ చేసేవారు, త్యాగం కలవారు నేడు అరుదు.
 తంత్రోపాసన చేసేవారు.... సాధారణంగా తమ దైనందిన జీవితంలో భగవంతుని చూసే అలవాటు కలిగి ఉంటారు.  వారికి ఈ ప్రపంచం ఎంత శూన్యంగా అనిపించిన ప్రతి చిన్న విషయంలో దైవాన్ని చూస్తారు. వారికి దైవము, జీవితం అభేద్యమైనవిగా అనిపిస్తాయి.
    వారికి మంచి - చెడు, తప్పు-ఒప్పు, బాగుంది - బాగులేదు.... వంటి విచక్షణలు ఉండవు. వీటన్నిటి వెనుక నుండి నడిపించేవాడు దైవమే అని వారికి తెలుసు కనుక.
      వారే కర్తలని ఎన్నడూ భావించరు. మనలో చాలామంది అంతా తామే చేస్తున్నామని అనుకుంటారు. అందుకే మనం  మంచి - చెడు, తప్పు-ఒప్పు,  బాగుంది - బాగోలేదు... వంటి కారణాలు వెతుక్కొని మాట్లాడుతూ ఉంటాము.
      ఈ క్రమంలో మనం మంచి పనులను  ఘనంగా చెప్పుకుని, చెడ్డ  పనులకు బాధపడి,  కుంచించుకు  పోతుంటాము.  కానీ తంత్ర ప్రపంచంలో మేము దేనిని ఘనతగా భావించము. ఎవరి తప్పొప్పులు ఎంచము. మేము అన్ని పనుల్లో దైవాన్ని చూస్తాము.
      అందుకే ఏదైనా తప్పుగా అనిపించదు. మాకు దైవం ఎంతో సుందరమైన వాడు. వారి చర్యలు మాటలకు అందనివి.  కొందరు ఏవైనా....అడిగినప్పుడు మేము కొన్ని వివరణలు ఇచ్చినా.... ఆ సమాధానం మేము ఇచ్చినది కాదని దైవమే ఆ సమయంలో మాతో అలా పలికించాడు అని మాకు తెలుసు.
     మీ జీవితాన్ని మీరు ప్రతి నిమిషం ఆస్వాదిస్తున్నప్పుడు.... ఎటువంటి ప్రణాళికలకు, ఊహలకు, గమ్యాలకు ఆశయాలకు.... తావుండదు.  మనం జీవిస్తున్నాం. అంతే. అది దైవానుగ్రహము. దేవుడిచ్చిన మార్గాన్ని గురించి చింతించడం..... జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేస్తుంది. కానీ  దేవుడు వారిని చూసి ఆశ్చర్యపోయేందుకు,
 ఒక్కోసారి కారణాలు వెతికేందుకు సృష్టించారని మనకు అర్థమవుతుంది.
      మనం కారణాలు వెతికే క్రమంలో ఆనందాన్ని దూరం చేసుకోకుండా దయతో ఆయన చూస్తారు.
      తంత్రం ద్వారా మాకు కారణం వెతికే కళ,   ఆశ్చర్యపోయే కళ మధ్య సమతుల్యత సాధించడం అలవాటు పడింది. ఆయన మా కోసం చేస్తున్న వాటికి  ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నాము. దైవాన్ని శరణాగతి వేడండి.

Comments